చీకటి వెలుగుల రంగేళి ......


ఆ నలుగురు ....!!!

                                                      ఎవరు ఉండిపోతారు రా అబ్బాయి శాశ్వతం గా ... అందరు ఏదో ఒక రోజు పోవాల్సిన వాళ్ళే ... నా నుంచి, మీ అమ్మ నుంచి , మీ అమ్మ అనే బండాడు దాక అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళే ... బండాడు అంటే నీకు గుర్తుండే వుంటుంది రామారావు రా ... !!! మునసబు లు కరణాలు రద్దు చేసాడని మీ అమ్మ అలా తిడుతూ వుండేది నీకు గుర్తుండే వుంటుంది ... కాని ఏదో మంచి జరిగింది లేరా జనాలకి అంతో ఇంతో ... సరే నువ్వు ఇల్లు కడుతున్నావ్ నాకు తెలుసు ... నీ గృహ ప్రవేశానికి మేము వస్తున్నాం ... !!! అది చెపుదాం అనే ఈ వుత్తరం .... 

                                                   మేమే కాదు మీ అత్త, మామ కూడా వస్తున్నారు .... నా తర్వాతే వచ్చేసింది గా మీ అత్త గారు ... పాపం ఏదో ఒకటి వండి పెడుతూ వుండేది రా నాకు రోజూ  .. తినండి అన్నయ గారు అని ... కాని మీ మామ గారి బాధలు పైనుంచి చూసి రోజు బాధ పడుతూ వుండేది .... సరేలే ఇప్పుడు ఇద్దరు పైన మాతో పాటే వుంటున్నారు లే .... పైన ఎక్కడ అని అడక్కు అవన్నీ దేవరహస్యాలు ఇదంతా చెప్పకూడదని వెధవ రూల్సు .... 

                                                  ఇంతకి నీ గృహప్రవేశానికి మేము పైనుంచి చూస్తూ వుంటామా లేదా అనుకుంటున్నావా ? నీ మొఖం మేము ఎప్పుడో ఇక్కడకి వచ్చేసాం ... నువ్వు ఇల్లు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇక్కడే వున్నాం ... మేము లేకుండా ఒక సిమెంటు రేకైనా , ఒక మట్టి గడ్డ అయినా లేపగలిగే వాడివా పెదబాబు ? అందుకే దగ్గరుండి మొత్తం చూస్కొని ... ఒక వారం కిందటే మళ్ళి పైకి వచ్చాం ... ఇక్కడ రూల్సు పాడు అంతే ... అప్పుడెప్పుడో ఈ స్థలం అమ్మేదాం అనుకున్నావ్ అని విన్నా .... కాని అమ్మకుండా మంచి పని చేశావ్ .. ఇప్పుడు అమ్మిన కొనే పరిస్థితి ఎక్కడుంది పెదబాబు .... 

                                                 రేపు నీ మనవళ్ళు నీ ఊరు ఏది అంటే ఏం చెపుతారు ? నీ పిల్లలకే అగినపర్రు పెద్దగా తెలీదు. పెద్దాడిని ఒకసారి తీసుకుని వెళ్ళావ్ అనుకుంటా ... చిన్నాడు ఇంతవరకు చూసినట్టే లేడు ..... మనకంటూ మన ఊళ్ళో ఒక సెంటో కుంటో వుండాలి అప్పుడే మనకి ఆ ఊరితో సంబంధాలు వుంటాయి ...సరే లే ఇంకా ఇవన్ని ఇప్పుడు ఎందుకు లే ... మీ అమ్మ వచ్చి రెండేళ్ళు అవ్తోంది కదూ ...!!!! నా దగ్గరే ఉంటోంది .... ఇప్పుడు అది ఎలా జరిగింది ఏంటి అని అడగకు ..... ఇప్పుడు అవన్నీ వద్దు లే ... ఎవరి పాపాన వాళ్ళే పోతారు ... ఇప్పటికే మీ అమ్మ వాళ్ళ మీద చాల చెప్పి వుంచింది లే ఇక్కడ వాళ్లకు .....   వాళ్ళు వచ్చేస్తారు లే ఇవాలో రేపో ... పాపం పండిన రోజు .... 

                                                 చినబాబు సంగతులు ఏంటి ? వాడి పెద్దమ్మాయికి నేనా ? మీ అమ్మా ? ఎవరు రావాలా .... అని ఆలోచిస్తున్నాం .... పెద్ద బుజ్జి కబుర్లు ఏంటి ? నాని పిల్లలు, మాధవి పిల్లలు బాగున్నారా ?

                                                 ఆ ఇల్లు పడగొట్టే అప్పుడు చాలా బాధ పడ్డాను పెదబాబు .... పైసా పైసా కూడ బెట్టి కొన్న స్థలం ఇల్లు కదూ అందుకే నేమో  ..!!! మీ అమ్మ అందిలే ఇప్పుడు అందరికి అది  ఎక్కడ సరిపోతుంది అని ... అది నిజమే ...కాని అన్ని పోయాయి కదూ .....  నేను పెంచిన కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జామ  చెట్లు, ఆ మిల్లు , ఆ బాత్రూం అన్నీనూ ... !!! ఆ బాత్రూం అంటే గుర్తొచ్చింది, పెద్దాడు కూడా నాలాగా 5 నిముషాల కంటే ఎక్కువ స్నానం చెయ్యడు  కదూ .... !!!! అది చూసి నువ్వు అన్ని తాత లక్షణాలే అని నువ్వు మురిసి పోవటం ... మా నాన్నే మళ్ళి ఇక్కడ తిరుతున్నాడు అనుకోవడం నాకు తెలీదు అనుకున్నావా ? ఇంకేముంది రా అబ్బాయ్ అయిపొయింది కదూ  ఈ జన్మ ... ఇక ఇంతే ... నీతో వచ్చి మళ్ళి మాట్లాడాలన్నా ... పలకరించాలన్నా కుదరదు వెధవ జీవితం ....


                                               ఇంకా చాల వున్నాయి చెప్పాల్సినవి కాని సమయానికి గుర్తు వచ్చి చావవు ... ఇక్కడ కూడా సిగరెట్లు వుంటాయి.... కాబట్టి అవి కాలుస్తూ  అప్పుడప్పుడు డైరీ రాస్తూ కూర్చుంటా ... మర్చేపోయా చినబుజ్జి కూడా మా దగ్గరే ఉంటోంది రా ... అది తొందరగా వచ్చినందుకు పెద్ద బాధగా లేదు లే నాకు .. అది మంచాన పడితే చూసేవాళ్ళు ఎవరున్నారు చెప్పు ... అందుకే మీ అమ్మ రాగానే బుజ్జి కూడా వచ్చేసింది ... అయినా ఎక్కడో చదివా .... దేవుడిని మనం ఏదన్నా అడగాలి అనుకుంటే బాధ తెలియని మరణం ... బ్రతికి వున్నన్నాళ్ళు ఒకళ్ళని చేయి చాచి అడగకుండా బ్రతకడం ఇవి అడగాలి అంట ... కాబట్టి అవి లభించాయని సంతోషపడటమే .... మా ముగ్గురు జీవితాలు అలాగే తెల్లారాయిలే  లే పెదబాబు .... 


                                              ఈ జన్మకేగా నీకు నాన్నని, మీ ఆవిడకి మామ గారిని, మీ పిల్లలకి తాతని ... మళ్ళి జన్మ ఏంటో తెలీదు కదరా ... అందుకే ఇంకా కొన్నాళ్ళు ఇవన్ని చూద్దాం అని ఇప్పుడే ఇంకో జన్మ వద్దు అని ఆ దేవుడికి కరాఖండిగా చెప్పేసాం ..... 


                                 సరే లే ఇదిగో మీ అత్త గారు ఏదో రాయాలి అంటోంది .. ఆవిడకి ఇస్తున్న ...... 

***************************************************************

                                         
                                         అమ్మాయి చంటి బాగున్నావా ? నేనేంటి వుత్తరం ఏంటి అనుకుంటున్నావా ? నీకు గుర్తుందా అప్పట్లో ఫణి నాకు చదవటం రాయటం నేర్పేవాడు కాని నిద్ర రావటమో ... పని ఉండటమో వల్ల నేను పెద్దగా శ్రద్ద చూపే దాన్ని కాదు ... ఇక్కడ పనీమి లేదు గా ... గొడ్డు గోద కూడా ఏం లేవాయే ... అందుకే ఇక్కడ నేర్చుకున్నా అన్నీనూ ... పోనిలే ఇలా అయినా నా కోరిక తీరింది సంతోషం .... అసలు ఈ వుత్తరం రాయటానికి మాకు పర్మిషను లేదు ... వాళ్ళు ఒప్పుకోకపోతేను మీ నాన్న వాళ్ళని కోప్పడాడు ... " లంబ్దికే మా పిల్లలకి వుత్తరం రాయటానికి నీ బోడి పర్మిషను ఏంటి " అని అప్పుడు కాని వాళ్ళు తగ్గి సరే అనలేదు .... 

                                         మొన్న మీ శంకుస్థాపన రోజు అక్కడే వున్నాం ... అది అయ్యాక మన ఊరు వెళ్ళాం ... పాపం రావి చెట్టు ఏంటి చంటి అట్టా అయిపొయింది ... నేను వెళ్లేసరికి ఎండుటాకులతో కల్లాపి చల్లింది ... ఆ ఆంజనేయ స్వామి గుడి అట్టాగే వుంది ...  మీ నాన్న లాగ అక్కడ కూర్చునే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరనుకుంట  అంతా బోసి గా వుంది ... ( కోర కొర చూస్తున్నాడు చంటో మీ నాన్న ఇలా అన్నానని ). 


                                       ఆ మురుక్కోటి పొలానికి , ఆ బాడవ  పొలానికి వెళ్ళాం బానే వున్నాయ్ అమ్మాయ్  . బుజ్జి, చిన్న బావున్నారా ? కమల సంగతులు ఏంటి ? రాజా  పెళ్ళికి వచ్చాం .... మీకు తేలేదు లే ... మనవరాలు బాగుంది .....కృష్ణమ్మా పిల్లలు బాగున్నారా ? పెద్దాడు ఏదో కాలేజీ గురించి గొడవ చేస్తున్నాడని విన్నా ... ఇప్పుడు ఆపేసాడ ?......  ఇక చందు సంగతి ఎందుకు లే ఇప్పుడు ... సన్నాసికి అన్ని తొందరే .... ముందే పరిగెత్తుకు వచ్చేసాడు .... ఇప్పుడు మాతో పాటే  ఉంటున్నాడు ... నిజం చెప్పాలి అంటే వాడే నాకు ఈ చదవటం రాయటం నేర్పింది .... అప్పుడప్పుడు అమ్మ కావాలి అంటాడు ... నేనే ఏదోటి చెప్పి సముదాయిస్తా వాడిని ... పిచ్చి గున్న .... 


                                       మళ్ళి ఓ సారి మీ అందరితో గడపాలని వుంది చంటి . అందరితో కలిసి ఆ కారపూస , బూరెలు, కజ్జికాయలు, వెన్న ఉండలు, గవ్వలు, వండాలని వుంది చంటి .... పిల్ల గున్నలు ఏం తింటున్నారో ... అప్పుడప్పుడు ఇక్కడ వండుతున్నాం నేను మీ అత్తగారు కలిసి .... చందు వుండాడు గా వెళ్లి పిండి పట్టించుకు వస్తాడు ... ఒకోసారి అనిపిస్తుంది ... పిల్లలు వుత్తరం రాస్తే వేరే వాళ్ళతో  చదివించుకుని ... ఇంకెవరితోనో వుత్తరం రాయించే అమ్మమ్మని నేనేనా అని ? ఇప్పుడు ఇలా వుత్తరం రాస్తున్నానా అని ? అయినా మాతో పాటే ఆ ఉత్తరాలు, పత్తరాలు కూడా చచ్చిపోయాయి అంట గా .. ఇప్పుడు ఎవరు వాడట్లేదు అని చందు చెప్పాడు .... వాడు ఏదో ఈమైలో , పామయిలో ఏదో వాడుతున్నారు అని చెప్పాడు ... 

                                      సరే నాన్నకి అన్నం పెట్టె టైం అయ్యింది. మళ్ళి  వీలు చూసుకుని వుత్తరం రాస్తా ... మీ నాన్న సంగతి తెలుసు గా టైం కి అన్నం పెడితే ఇక మన జోలికి రారు . నీకు గుర్తుండే వుంటుంది అప్పుడప్పుడు నిన్ను అడిగేవారు " ఏమ్మా చంటి అన్నం పెడతావా " అని .... 

                                     సరే వుంటా అమ్మా ... ఇంకో సంగతి నీ కన్నా ఫణి బాగా వంటలు వండుతున్నాడు అంట గా  ఎంతైనా వాడు అమ్మమ్మ ట్రైనింగ్ ... 

************************************************************

                                     సరే పెదబాబు ఇక వుంటాను నేను కూడా ... ఎంత రాసిన ఏదొకటి గుర్తువస్తూనే వుంటుంది .... మళ్ళి ఒక సారి ఆ సైకిల్ ఏసుకుని ఊరంతా తిరగాలని, ఆ లాకు సెంటర్ లో సిగరెట్టు తాగాలని, మళ్ళి నా మనవళ్ళని సైకిల్ మీద ఎక్కించుకుని పమిడిముక్కల నుంచి తీసుకుని రావాలని వుంది పెదబాబు ....... !!!!! ప్చ్ ...... !!!!
                                    ఇక ఇంతకు మించి నా స్నేహితులు ఎవరు లేరు అక్కడ ... అందరు ఇక్కడికే జేరారు ... అందరూ నా ఈడు వాళ్ళే కదూ ... !!!! ఏదో ఇక వాళ్ళతోనే నా కాలక్షేపం ..... 

                                    సరే హనుమంత రావు ని ఈశ్వర రావు ని అడిగానని చెప్పు, గృహ ప్రవేశం అయ్యాక ఇంకా బోల్డు కబుర్లతో వీలు చూసుకుని వుత్తరం రాస్తాను .... నువ్వేం భయపడకు నా ఆశీస్సులు ఎప్పుడు వుంటాయి ... నేను కూడా కొత్త పంచె కట్టుకుని చూస్తూ వుంటా కార్యక్రమం అంతా .... 

                                                                                                                                       ఇట్లు,
                                                                                                                                     ఆ నలుగురు... నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......