చీకటి వెలుగుల రంగేళి ......


ఆ నలుగురు ....!!!

                                                      ఎవరు ఉండిపోతారు రా అబ్బాయి శాశ్వతం గా ... అందరు ఏదో ఒక రోజు పోవాల్సిన వాళ్ళే ... నా నుంచి, మీ అమ్మ నుంచి , మీ అమ్మ అనే బండాడు దాక అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళే ... బండాడు అంటే నీకు గుర్తుండే వుంటుంది రామారావు రా ... !!! మునసబు లు కరణాలు రద్దు చేసాడని మీ అమ్మ అలా తిడుతూ వుండేది నీకు గుర్తుండే వుంటుంది ... కాని ఏదో మంచి జరిగింది లేరా జనాలకి అంతో ఇంతో ... సరే నువ్వు ఇల్లు కడుతున్నావ్ నాకు తెలుసు ... నీ గృహ ప్రవేశానికి మేము వస్తున్నాం ... !!! అది చెపుదాం అనే ఈ వుత్తరం .... 

                                                   మేమే కాదు మీ అత్త, మామ కూడా వస్తున్నారు .... నా తర్వాతే వచ్చేసింది గా మీ అత్త గారు ... పాపం ఏదో ఒకటి వండి పెడుతూ వుండేది రా నాకు రోజూ  .. తినండి అన్నయ గారు అని ... కాని మీ మామ గారి బాధలు పైనుంచి చూసి రోజు బాధ పడుతూ వుండేది .... సరేలే ఇప్పుడు ఇద్దరు పైన మాతో పాటే వుంటున్నారు లే .... పైన ఎక్కడ అని అడక్కు అవన్నీ దేవరహస్యాలు ఇదంతా చెప్పకూడదని వెధవ రూల్సు .... 

                                                  ఇంతకి నీ గృహప్రవేశానికి మేము పైనుంచి చూస్తూ వుంటామా లేదా అనుకుంటున్నావా ? నీ మొఖం మేము ఎప్పుడో ఇక్కడకి వచ్చేసాం ... నువ్వు ఇల్లు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇక్కడే వున్నాం ... మేము లేకుండా ఒక సిమెంటు రేకైనా , ఒక మట్టి గడ్డ అయినా లేపగలిగే వాడివా పెదబాబు ? అందుకే దగ్గరుండి మొత్తం చూస్కొని ... ఒక వారం కిందటే మళ్ళి పైకి వచ్చాం ... ఇక్కడ రూల్సు పాడు అంతే ... అప్పుడెప్పుడో ఈ స్థలం అమ్మేదాం అనుకున్నావ్ అని విన్నా .... కాని అమ్మకుండా మంచి పని చేశావ్ .. ఇప్పుడు అమ్మిన కొనే పరిస్థితి ఎక్కడుంది పెదబాబు .... 

                                                 రేపు నీ మనవళ్ళు నీ ఊరు ఏది అంటే ఏం చెపుతారు ? నీ పిల్లలకే అగినపర్రు పెద్దగా తెలీదు. పెద్దాడిని ఒకసారి తీసుకుని వెళ్ళావ్ అనుకుంటా ... చిన్నాడు ఇంతవరకు చూసినట్టే లేడు ..... మనకంటూ మన ఊళ్ళో ఒక సెంటో కుంటో వుండాలి అప్పుడే మనకి ఆ ఊరితో సంబంధాలు వుంటాయి ...సరే లే ఇంకా ఇవన్ని ఇప్పుడు ఎందుకు లే ... మీ అమ్మ వచ్చి రెండేళ్ళు అవ్తోంది కదూ ...!!!! నా దగ్గరే ఉంటోంది .... ఇప్పుడు అది ఎలా జరిగింది ఏంటి అని అడగకు ..... ఇప్పుడు అవన్నీ వద్దు లే ... ఎవరి పాపాన వాళ్ళే పోతారు ... ఇప్పటికే మీ అమ్మ వాళ్ళ మీద చాల చెప్పి వుంచింది లే ఇక్కడ వాళ్లకు .....   వాళ్ళు వచ్చేస్తారు లే ఇవాలో రేపో ... పాపం పండిన రోజు .... 

                                                 చినబాబు సంగతులు ఏంటి ? వాడి పెద్దమ్మాయికి నేనా ? మీ అమ్మా ? ఎవరు రావాలా .... అని ఆలోచిస్తున్నాం .... పెద్ద బుజ్జి కబుర్లు ఏంటి ? నాని పిల్లలు, మాధవి పిల్లలు బాగున్నారా ?

                                                 ఆ ఇల్లు పడగొట్టే అప్పుడు చాలా బాధ పడ్డాను పెదబాబు .... పైసా పైసా కూడ బెట్టి కొన్న స్థలం ఇల్లు కదూ అందుకే నేమో  ..!!! మీ అమ్మ అందిలే ఇప్పుడు అందరికి అది  ఎక్కడ సరిపోతుంది అని ... అది నిజమే ...కాని అన్ని పోయాయి కదూ .....  నేను పెంచిన కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జామ  చెట్లు, ఆ మిల్లు , ఆ బాత్రూం అన్నీనూ ... !!! ఆ బాత్రూం అంటే గుర్తొచ్చింది, పెద్దాడు కూడా నాలాగా 5 నిముషాల కంటే ఎక్కువ స్నానం చెయ్యడు  కదూ .... !!!! అది చూసి నువ్వు అన్ని తాత లక్షణాలే అని నువ్వు మురిసి పోవటం ... మా నాన్నే మళ్ళి ఇక్కడ తిరుతున్నాడు అనుకోవడం నాకు తెలీదు అనుకున్నావా ? ఇంకేముంది రా అబ్బాయ్ అయిపొయింది కదూ  ఈ జన్మ ... ఇక ఇంతే ... నీతో వచ్చి మళ్ళి మాట్లాడాలన్నా ... పలకరించాలన్నా కుదరదు వెధవ జీవితం ....


                                               ఇంకా చాల వున్నాయి చెప్పాల్సినవి కాని సమయానికి గుర్తు వచ్చి చావవు ... ఇక్కడ కూడా సిగరెట్లు వుంటాయి.... కాబట్టి అవి కాలుస్తూ  అప్పుడప్పుడు డైరీ రాస్తూ కూర్చుంటా ... మర్చేపోయా చినబుజ్జి కూడా మా దగ్గరే ఉంటోంది రా ... అది తొందరగా వచ్చినందుకు పెద్ద బాధగా లేదు లే నాకు .. అది మంచాన పడితే చూసేవాళ్ళు ఎవరున్నారు చెప్పు ... అందుకే మీ అమ్మ రాగానే బుజ్జి కూడా వచ్చేసింది ... అయినా ఎక్కడో చదివా .... దేవుడిని మనం ఏదన్నా అడగాలి అనుకుంటే బాధ తెలియని మరణం ... బ్రతికి వున్నన్నాళ్ళు ఒకళ్ళని చేయి చాచి అడగకుండా బ్రతకడం ఇవి అడగాలి అంట ... కాబట్టి అవి లభించాయని సంతోషపడటమే .... మా ముగ్గురు జీవితాలు అలాగే తెల్లారాయిలే  లే పెదబాబు .... 


                                              ఈ జన్మకేగా నీకు నాన్నని, మీ ఆవిడకి మామ గారిని, మీ పిల్లలకి తాతని ... మళ్ళి జన్మ ఏంటో తెలీదు కదరా ... అందుకే ఇంకా కొన్నాళ్ళు ఇవన్ని చూద్దాం అని ఇప్పుడే ఇంకో జన్మ వద్దు అని ఆ దేవుడికి కరాఖండిగా చెప్పేసాం ..... 


                                 సరే లే ఇదిగో మీ అత్త గారు ఏదో రాయాలి అంటోంది .. ఆవిడకి ఇస్తున్న ...... 

***************************************************************

                                         
                                         అమ్మాయి చంటి బాగున్నావా ? నేనేంటి వుత్తరం ఏంటి అనుకుంటున్నావా ? నీకు గుర్తుందా అప్పట్లో ఫణి నాకు చదవటం రాయటం నేర్పేవాడు కాని నిద్ర రావటమో ... పని ఉండటమో వల్ల నేను పెద్దగా శ్రద్ద చూపే దాన్ని కాదు ... ఇక్కడ పనీమి లేదు గా ... గొడ్డు గోద కూడా ఏం లేవాయే ... అందుకే ఇక్కడ నేర్చుకున్నా అన్నీనూ ... పోనిలే ఇలా అయినా నా కోరిక తీరింది సంతోషం .... అసలు ఈ వుత్తరం రాయటానికి మాకు పర్మిషను లేదు ... వాళ్ళు ఒప్పుకోకపోతేను మీ నాన్న వాళ్ళని కోప్పడాడు ... " లంబ్దికే మా పిల్లలకి వుత్తరం రాయటానికి నీ బోడి పర్మిషను ఏంటి " అని అప్పుడు కాని వాళ్ళు తగ్గి సరే అనలేదు .... 

                                         మొన్న మీ శంకుస్థాపన రోజు అక్కడే వున్నాం ... అది అయ్యాక మన ఊరు వెళ్ళాం ... పాపం రావి చెట్టు ఏంటి చంటి అట్టా అయిపొయింది ... నేను వెళ్లేసరికి ఎండుటాకులతో కల్లాపి చల్లింది ... ఆ ఆంజనేయ స్వామి గుడి అట్టాగే వుంది ...  మీ నాన్న లాగ అక్కడ కూర్చునే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరనుకుంట  అంతా బోసి గా వుంది ... ( కోర కొర చూస్తున్నాడు చంటో మీ నాన్న ఇలా అన్నానని ). 


                                       ఆ మురుక్కోటి పొలానికి , ఆ బాడవ  పొలానికి వెళ్ళాం బానే వున్నాయ్ అమ్మాయ్  . బుజ్జి, చిన్న బావున్నారా ? కమల సంగతులు ఏంటి ? రాజా  పెళ్ళికి వచ్చాం .... మీకు తేలేదు లే ... మనవరాలు బాగుంది .....కృష్ణమ్మా పిల్లలు బాగున్నారా ? పెద్దాడు ఏదో కాలేజీ గురించి గొడవ చేస్తున్నాడని విన్నా ... ఇప్పుడు ఆపేసాడ ?......  ఇక చందు సంగతి ఎందుకు లే ఇప్పుడు ... సన్నాసికి అన్ని తొందరే .... ముందే పరిగెత్తుకు వచ్చేసాడు .... ఇప్పుడు మాతో పాటే  ఉంటున్నాడు ... నిజం చెప్పాలి అంటే వాడే నాకు ఈ చదవటం రాయటం నేర్పింది .... అప్పుడప్పుడు అమ్మ కావాలి అంటాడు ... నేనే ఏదోటి చెప్పి సముదాయిస్తా వాడిని ... పిచ్చి గున్న .... 


                                       మళ్ళి ఓ సారి మీ అందరితో గడపాలని వుంది చంటి . అందరితో కలిసి ఆ కారపూస , బూరెలు, కజ్జికాయలు, వెన్న ఉండలు, గవ్వలు, వండాలని వుంది చంటి .... పిల్ల గున్నలు ఏం తింటున్నారో ... అప్పుడప్పుడు ఇక్కడ వండుతున్నాం నేను మీ అత్తగారు కలిసి .... చందు వుండాడు గా వెళ్లి పిండి పట్టించుకు వస్తాడు ... ఒకోసారి అనిపిస్తుంది ... పిల్లలు వుత్తరం రాస్తే వేరే వాళ్ళతో  చదివించుకుని ... ఇంకెవరితోనో వుత్తరం రాయించే అమ్మమ్మని నేనేనా అని ? ఇప్పుడు ఇలా వుత్తరం రాస్తున్నానా అని ? అయినా మాతో పాటే ఆ ఉత్తరాలు, పత్తరాలు కూడా చచ్చిపోయాయి అంట గా .. ఇప్పుడు ఎవరు వాడట్లేదు అని చందు చెప్పాడు .... వాడు ఏదో ఈమైలో , పామయిలో ఏదో వాడుతున్నారు అని చెప్పాడు ... 

                                      సరే నాన్నకి అన్నం పెట్టె టైం అయ్యింది. మళ్ళి  వీలు చూసుకుని వుత్తరం రాస్తా ... మీ నాన్న సంగతి తెలుసు గా టైం కి అన్నం పెడితే ఇక మన జోలికి రారు . నీకు గుర్తుండే వుంటుంది అప్పుడప్పుడు నిన్ను అడిగేవారు " ఏమ్మా చంటి అన్నం పెడతావా " అని .... 

                                     సరే వుంటా అమ్మా ... ఇంకో సంగతి నీ కన్నా ఫణి బాగా వంటలు వండుతున్నాడు అంట గా  ఎంతైనా వాడు అమ్మమ్మ ట్రైనింగ్ ... 

************************************************************

                                     సరే పెదబాబు ఇక వుంటాను నేను కూడా ... ఎంత రాసిన ఏదొకటి గుర్తువస్తూనే వుంటుంది .... మళ్ళి ఒక సారి ఆ సైకిల్ ఏసుకుని ఊరంతా తిరగాలని, ఆ లాకు సెంటర్ లో సిగరెట్టు తాగాలని, మళ్ళి నా మనవళ్ళని సైకిల్ మీద ఎక్కించుకుని పమిడిముక్కల నుంచి తీసుకుని రావాలని వుంది పెదబాబు ....... !!!!! ప్చ్ ...... !!!!
                                    ఇక ఇంతకు మించి నా స్నేహితులు ఎవరు లేరు అక్కడ ... అందరు ఇక్కడికే జేరారు ... అందరూ నా ఈడు వాళ్ళే కదూ ... !!!! ఏదో ఇక వాళ్ళతోనే నా కాలక్షేపం ..... 

                                    సరే హనుమంత రావు ని ఈశ్వర రావు ని అడిగానని చెప్పు, గృహ ప్రవేశం అయ్యాక ఇంకా బోల్డు కబుర్లతో వీలు చూసుకుని వుత్తరం రాస్తాను .... నువ్వేం భయపడకు నా ఆశీస్సులు ఎప్పుడు వుంటాయి ... నేను కూడా కొత్త పంచె కట్టుకుని చూస్తూ వుంటా కార్యక్రమం అంతా .... 

                                                                                                                                       ఇట్లు,
                                                                                                                                     ఆ నలుగురు... ఎన్నికల యా (ఏ) ప్స్ .......


                                                       ప్పటి లాగే అందరికి మామూలు గానే  తెల్లారింది . కాని ఐ టి అప్పారావు కి మాత్రం అది మామూలు రోజు కాదు. అతనికి రాత్రి కలలో ఎన్నికల తల్లి కనపడింది ( అవును అన్నిటికి తల్లి వున్నప్పుడు ఎన్నికలకి కూడా వుంటే తప్పేంటి ?). తన బాధని ఇలా వెళ్ళగక్కింది " బాబూ ! ఈ జనాలు నాయకులని సరిగ్గా అర్ధం చేస్కో లేకపొతున్నారు, నువ్వే ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తెచ్చి జనాలు చెప్పేది కూడా నాయకులు వినేలా చేసి జనాల కస్టాలు తీర్చాలి " అని భోరున ఏడవటం మొదలెట్టింది. అసలే ఈ మద్య టి వి లలో గృహ హింస చట్టం, నిర్భయ చట్టం అని చూసాడేమో , మళ్ళి పోలీసులు వచ్చి ఎక్కడ ఆ ఏడుపుకి వీడే కారణం అని లోపల వేస్తారో అని " అలాగే నువ్వు ఏడుపు ఆపు తల్లి "అని అభయం ఇచ్చాడు . ఏడుపు ఆపేసిన ఎన్నికల తల్లి అల్ ది బెస్ట్ చెప్పి చటుక్కున మళ్ళి బాలెట్ బాక్స్ లో దూరింది . 
                                        వెంటనే ఏం చెయ్యలా అని ఆలోచించిన అప్పారావు ఒక యాప్ తయారు చెయ్యాలి అనుకున్నాడు. దీంతో  నాయకులు ఓటర్లు ఎప్పుడు కనెక్టెడ్ గా వుండి ఒకరి అభిప్రాయలు ఒకళ్ళు పంచుకోగలరు. దీనికి అనతి కాలం లోనే మంచి ప్రాచుర్యం లభించింది. దీంతో ఓటర్లతో పాటు నాయకులు కూడా బాగా వాడటం మొదలెట్టారు . టెక్నాలజీ లో ముందుండే బాబు గారు దీన్ని వాడటమే కాక పార్టీ లో అందరూ కూడా  తప్పకుండా వాడమని సూచించారు . ఇది తెలుసుకున్న మిగతా పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. 

                                         మొదటగా బాబు గారు " తమ్ముళ్ళు  ... ! అందరికి నమస్కారం ......... !!! మన పార్టీ మ్యానిఫెస్టో చూసారా ... అని వర్గాల వారి కోసరం (కోసం సామాన్య బాషలో ) రూపొందించాం. కాబట్టి దీన్ని జనాల్లోకి తీసుకు పోవాల్సిన బాధ్యతా మన అందరి మీద వుంది .... జై తెలుగు దేశం ..!! " అని అన్నారు . [గంటా, రాయపాటి, గల్లా ....... etc లైక్స్ దిస్ ]. తమకంటే ముందే కొత్తగా పార్టీ కి వచ్చిన వాళ్ళు లైక్ కొట్టడం తో అసహనానికి గురైన తెలుగు తమ్ముళ్ళు చేసేది లేక " సూపర్ సార్ .... సూపర్ సార్ ...." అని కామెంట్ లు అద్ది చేతులు దులుపుకున్నారు . ఇంకొంత మంది అటు మింగలేక ఇటు కక్కలేక గుడ్లప్పగించి చూస్తూ వుండిపోయారు . ఇదే ఊపు తో బాబు గారు తనదైన శైలి లో పార్టీ ఫోటో లు, హామీలతో ఆ విధంగా ముందుకి పోతూ వున్నారు. 

                                   ఈ సంగతి ఆ నోట ఈ నోట విన్న సోనియా వెంటనే కాంగ్రెస్ తరపున ప్రచారానికి చిరంజీవి ని పురమాయించింది . అసలే మనకి ఇప్పుడు అంతంత మాత్రం గా వున్న పాప్యులారిటి కి ఈ విభజన అంశం తోడవటం తో అదః పాతాళం లో వున్న  మన ఇమేజ్ గురించి మేడం కి చెప్పే ధైర్యం లేక సరే అని తలూపాల్సి వచ్చింది చిరు కి. వెంటనే చిరు పని మొదలు పెట్టి మొదటి అప్ డేట్ గా " విభజన కి కారణం కాంగ్రెస్ మాత్రమే కాదు, వై యస్ ఆర్ పార్టీ , టి డి పి ఓకే అనబట్టే ముందుకు వెళ్ళాం " అని అప్ డేట్ పెట్టాడు . [ సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, ..... గాంధీ ...... గాంధీ ...... గాంధీ ..... etc లైక్స్ దిస్]. ఇది చూసిన నన్నపనేని " బాబు ... !! చిట్టీ ..... " అని పాత శ్రీ లక్ష్మి ఫోటో కామెంట్ పెట్టింది . [ అంబటి లైక్స్ దిస్ ఫోటో కామెంట్ ]. ఇక సీమంద్రలో ఇలాంటి అవమానానే ఎదురవుతాయి అనుకున్న సోనియా దుకాణం తెలంగాణాకి మార్చి పొన్నాలకి ఆ పని అప్పచెప్పింది. వెంటనే పొన్నాల " తెలంగాణా తెచ్చింది కాంగ్రెస్సే .... ! " అని స్టేటస్ అప్ డేట్ చేసాడు . వెంటనే కవిత " అట్నా ... ! మంచిగా చెప్పినవ్ లే బిడ్డా ... ! " అని తెలంగాణా శకుంతల ఫోటో కామెంట్ పెట్టింది . [అంబటి లైక్స్ దిస్ ఫోటో కామెంట్ ]. ఇక చేసేది లేక దేవుడి దిక్కు అనుకుని జరిగేది చూడాలని డిసైడ్ అయ్యింది ఈ కాంగ్రెస్ టీం.

                                     ఇక అసలే ఏం అప్ డేట్ పెట్టాలో అర్ధం కాక తల పట్టుకుని కూర్చున్న జగన్ అంబటి కి ఫోన్ చేసి " ఎప్పుడూ  చిత్త కార్తె ......... "అని ఏదో ఒక నిముషం 3 సెకన్ల పొడవున్న బూతు తిట్టి వెంటనే ఇంటికి రమ్మని ఆదేశించాడు. కాని ఎప్పటి లాగే అందరితో చర్చించే లోపే సొంతగా స్టేటస్ అప్ డేట్ చేసేశాడు " అక్క చెల్లెమ్మలకి చేయూతనిచ్చే అమ్మ ఒడి పథకం మీదే నా మొదటి సంతకం " అని  . [ వాసి రెడ్డి పద్మ, రోజా , షర్మిల ........... etc లైక్స్ దిస్]. ఇంకా నయం అవినీతి అంతం అని ఏదన్నా బిల్లు తెస్తాను అని అప్ డేట్ చేస్తాడేమో అని భయ పడి  చచ్చాం అని గుస గుస లాడుకున్నారు. ఆ స్టేటస్ తను పెట్టుంటే ఆ లైక్స్ అన్ని తనకే వచ్చేవి కదా అనుకుంటూ వెనుదిరిగాడు అంబటి . 

                         ఇంకా కొత్త గా పార్టీ పెట్టిన పాత చెప్పుల కొట్టు అబ్బాయి " ఇంక గూడ్క ... మన రాష్టం గూడ్క సమైక్యం గానే వుంది .... ఆఖరి బాల్ మిగిలే వుంది . " అని అప్ డేట్ చేసాడు. ముందు దీనికి 10 లైక్స్ వచ్చాయి. కాని మరో 2 నిముషాలకే అవి 5 కి తగ్గిపోయాయి . వెంటనే ఎవరో గోడమీద పిల్లులు ఉన్నారన్న విషయం గ్రహించిన సారు ఆ పిల్లులు గోడ దాటకుండా పెద్ద గోడ ఎలా కట్టాలా అని బెర్లిన్ తాపి మేస్త్రి దగ్గర నేర్చుకుందామని అక్కడికి వెళ్ళిపోయాడు ప్రస్తుతానికి. 

                    మరో కొత్త పార్టీ వారికి ప్రస్తుతానికి తాడు బొంగరం లేవు కనుక అవి కొనుక్కుని వచ్చి, వచ్చే ఎలక్షన్లలో పాల్గొంటాం . .  . . అప్పటి దాక పుస్తకాల కొట్టు పెట్టుకుని నచ్చిన పార్టీ ల పోస్ట్ లకి లైకులు కొడుతూ వుంటాం అని చెప్పారు . 


ఈ తతంగం అంతా చూస్తున్న ఓటరు ఇలా తన స్టేటస్ పెట్టాడు " అయ్యా ... !! మీరు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు చాలు , కాని నాకు వీటితో అసలు పని లెదు. నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా. దయచేసి జనాల్ని సోమరిపోతులని చెయ్యకండి . నాకు 5 రూపాయలకే అన్నం అవసరం లేదు. అంతగా డబ్బులు లేకపోతే గుడిలో పెట్టే ఉచిత అన్నదానం లో తింటాం లేదంటే సత్రం లో తింటాం . అయ్యా ...!!! నాకు ఆడపిల్ల పుడితే మీరిచ్చే డబ్బులో ... నా పిల్లలకి ఉచితం గా విద్యలో వద్దు ....  మా ఆర్ధిక పరిస్థితి ని బట్టి మేము పిల్లల్ని పెంచలేం , వాళ్ళకి చదువులు చెప్పించలేం అని అనిపిస్తే పిల్లల్ని కనటమే మానేస్తాం .అయ్యా ... !!! నేను రుణం తీసుకున్న రోజే తెలుసు నాకు అది తిరిగి కట్టాలని ... దానికి ఇష్టపడే తీసుకున్నాను . దాన్ని నేను ఈ ఏడాదో లేదంటే వచ్చే ఏడాదో కడతాను. మీరు వాటిని మాఫీ చెయ్యాల్సిన పని లేదు . చూడండి బాబులు ఇలా వందలో ఒక్కరికి ఉపయోగపడే హామీలు వద్దు. వాటి పేరు చెప్పుకుని మిగతా డబ్బులు మీరు మింగొద్దు . ఈ సమాజానికి ఉపయోగపడేవి చెయ్యండి " అని చెప్పి ఓటరు ముగించాడు . ఇదంతా ఆసక్తి గా గమనిస్తున్న ఎలక్షన్ కమీషన్ " సమాజానికి ఉపయోగపడేవి అంటే ? " అని కామెంట్ పెట్టింది . 


                                        " అయ్యా ... ! మా ఊరికి రోడ్డ్డు లేదు .. అది వేయించండి ...రాత్రి అయితే ఊరు మొత్తం మీద ఒక్క వీధి దీపం వెలగదు ... అవి పెట్టించండి . . . . మా పిల్లలు బడికి పోవాలంటే రోజు పక్క ఊరు పోవాల్సి వస్తోంది ... మా ఊళ్లోనే ఒక బడి కట్టించండి . . . . రేపు మా పిల్లలు చదువు కుంటే వారికి ఉపాది దొరికేలా మంచి కంపనీ లను రాష్టానికి రప్పించండి ... మాకు ఉచితం గా లక్షల కార్పొరేట్ వైద్యం వద్దు సారూ .... మా ఊళ్లోనే ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రి కట్టించండి .  . . మీ ఉచిత వైద్యం చేయించుకోవటానికి 100 కిలో మీటర్లు వెళ్ళే దాక అయినా మా ప్రాణం నిలబడాలి కదా సారూ . . . . మా పొలాలు ఎండిపోకుండా చెరువులు తవ్వించండి ... ప్రాజెక్ట్ లు కట్టించండి .... కాని వాటి లో అవినీతి ని మాత్రం పారిచంకండి .... ఇన్ని సమస్యలు వదిలేసి ఏదో ఒకళ్ళు ఇద్దరికి ఉపయోగపడే ఈ పధకాలు మాకెందుకు బాబు ? మిగతా డబ్బు బినామీ పేర్లతో మీ జేబులోకి పోవటానికా  సారూ ... !! ఇవి చేస్తానని చెప్పండి మీకే ఓటేస్తాం ... !! లేకపోయినా ఓటేస్తాం .... కాకపోతే అందరికి ఒకే ఓటు " తిరస్కరణ ఓటు " " అని అన్ని పార్టీ లకి చెంప పెట్టు లాంటి సమాధానం చెప్పి మళ్ళి తన పనిలో మునిగిపోయాడు ఆ సామాన్యుడు . 

                                  ఇదంతా నిశితం గా గమనించిన ఎలక్షన్ కమీషన్ ఇక మీదట ఇలాంటి హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు చేస్తాం అని ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది . ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించని పార్టీలు బతుకు దేవుడా అంటూ ... మళ్ళి కొత్త మ్యానిఫెస్టో లు తయారు చేసే పనిలో పడ్డాయి ....

                                 ఇలాంటి రోజు ఒకటి రావాలని, తప్పకుండా వస్తుందనీ మనమూ ఆశిద్దాం .....
                          


నా పిల్లలతో చేయించాల్సిన పనులు ......1. వాళ్ళని నేను ఎలా పెరిగానో అలానే పెంచాలి. సెలవలకి అమ్మమ్మ , నాయనమ్మ వాళ ఇళ్ళల్లో వదిలెయ్యాలి.
2. వాళ్ళకి కాగితం తో గాలిపటాలు చెయ్యటం, మట్టి తో బొమ్మలు చెయ్యటం నేర్పాలి.
3. వాళ్లకి తాటి కాయలు , తేగలు అన్నిటి రుచి చూపించాలి . ప్రకృతి కి దగ్గర గా ఉంచాలి. ఆ పంట పొలాలు, ఆ కాలువలు , ఆ పొలం గట్లు ,, ఇళ్ళలో పెంచే కోళ్ళు , గేదలు వీటన్నిటి తో అనుబంధం వుండాలి .
4. వాళ్ళతో తెలుగు లో అమ్మమ్మ , నాయనమ్మలకి వుత్తరం రాయించి వాళ్ళ తోనే పోస్ట్ చేయించాలి .
5. పండగలప్పుడు పల్లెటూళ్ళల్లో జరిగే సందడి వాళ్లకి కొంచం అయినా చూపించాలి. ( అప్పటికి అదృష్టవశాత్తు కొనవూపిరి మీదున్న ఈ సంస్కృతి బతికుంటే .... )


 

చివరి గా నేను పోయిన రోజు న,  ఏం పెంచాడు రా మా నాన్న!!!!!!!! ఎన్ని మధుర స్మృతులు మిగిల్చాడో నాకు .... అని వాళ్ళు అనుకోవాలి. ఇక అంతకు మించి జన్మకి సార్ధకత ఏముంది ....... 

కొత్తా దేవుడండీ ......

                                               


                                            డచిన అయిదారు నెలలనుంచి రాష్ట్రం లో జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం ప్రస్తుతానికి పతాక స్థాయికి  చేరుకుందనే చెప్పాలి .... ఇప్పుడు అన్ని పార్టీలు గతం గతః అని పాత విషయాలు వదిలేసి ప్రస్తుతానికి ఎన్నికల మీదే ద్రుష్టి పెట్టాయి ..... ఈ క్రమం లో ప్రత్యర్దులని కట్టడి చేసే పనిలో ఒకరిపై ఒకరు కత్తులు దువ్వుకుంటున్నాయి ..... కోటి విద్యలు కూటికొరకే అన్నట్టు ..... ఇంతకు ముందు వరకు నాయకులకు పరిమితం అయిన ఆపరేషన్ ఆకర్ష పథం ఇప్పుడు జనం వైపుకు మళ్ళింది .... ఇప్పుడు మన నాయకులు హామీలను గుప్పించే పనిలోవున్నారు ...... తెలంగాణా సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని కొన్ని సీట్లు అయినా  సంపాదిద్దాం అనుకున్న కాంగ్రెస్ కి కే సి అర్ గట్టి షాకే ఇచ్చారు ..... ప్రస్తుతానికి కాంగ్రెస్ పరిస్థితి కొంత మెరుగ్గానే కనపడుతున్నా కే సి అర్ తనకి వున్నా రాజకీయ నైపుణ్యం తో కాంగ్రెస్ ని కిందకి తొక్కే పనిలో వున్నారు ..... కే సి అర్ అమలు చేసిన వ్యూహం తో కాంగ్రెస్పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది .... ప్రస్తుతానికి ఈ రెండు పార్టీలు ఘాటుగా తగువు లాడుకుంటుంటే పిల్లి పోరు పిల్లి పోరు పిట్ట తీర్చింది అన్న చందం గా  మోడీ హవా తో వున్నా బి జె పి కి లేదా బి సి కార్డు తో బయల్దేరిన తెలుగు దేశానికీ ఇది కలిసొచ్చేలా  వుంది ....


                                                ఇక సీమంద్ర విషయానికి వస్తే మొదటగా పేరుకి చెప్పుకో వలిసింది కాంగ్రెస్ పార్టీ ని. ఎప్పుడయితే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందో అప్పుడే కాంగ్రెస్ బస్సుకి అన్ని టయిర్లు పంచరు  పడి  చతికిల పడింది .... ఇప్పుడు అదే బస్సుని చిరంజీవి ముందుకు నడపటానికి ప్రయత్నిస్తూ తన శక్తికి మించిన పనినే తలపైకి ఎత్తుకున్నారు . ఎలాగు కాంగ్రెస్ కి ప్రస్తుతానికి భవిష్యత్త్ పై కనుచూపు మేర పెద్దగా  ఆశలు లేనందున చిరంజీవి పైన ఒకింత వొత్తిడి లేదనే చెప్పాలి ..... ప్రస్తుతానికి అయితే సీమాంద్ర లో కాంగ్రెస్ బస్సు ముందుకి కదిలే పనిలేదు. మరో అయిదేళ్ళలో దానికి జరిగే మరమ్మత్తులు బట్టే దాని భవిష్యత్తు  ఆధారపడి వుంది.

                                          ఇక రెండు కళ్ళ సిద్ధాంతం తో ఇటు స్వ పక్షం తోనూ ... అటు విపక్షం తోనూ విమర్శలకు గురైన బాబు గారు .... చివరికి తనే కరెక్ట్ అని నిరూపించారు .... సీమంద్రలో ముందంజలో ఉండటమే కాక అటు తెలంగాణా లోను పార్టీ ని బ్రతికిన్చుకోవడం లో సఫలం అయ్యారు .... కాంగ్రెస్ నుంచి వచ్చి పడుతున్న వారిని సైకిల్ ఎక్కించుకుని జనాల  ద్రుష్టి ఒకింత బానే ఆకర్షిస్తున్నారని చెప్పాలి ...... ఇప్పుడు దేశం పార్టీ కొత్త, పాత నీటి కలయికతో సీమంద్రలో జోరుగా ప్రవహిస్తున్నా .... రేపు నియోజక వర్గాల్లో అభ్యర్దుల పేర్లు ప్రకటించిన తరువాత కొంతమందికి భంగపాటు తప్పేలా లేదు .... ఇప్పటికే కొంతమంది కొత్తగా చేరిన వారికి పార్టీ లో ప్రాముఖ్యం ఇవ్వటం పై గుర్రు గా వున్నరు. ఇప్పుడు సీమంద్రలో బాబు గారి ముఖ్యమయిన పని ఇలాంటివి అరికట్టడమే .... రేపు అదే జరిగితే ఆశావహులందరూ మీడియా సమావేశాలు పెట్టి బాబు గారి మీద దుమ్మెత్తక మానరు ..... ప్రస్తుతానికి బాబు గారికి వున్న రాజకీయ అనుభవం తో ఇప్పుడు గట్టెక్కిన .... రేపు ఒక వేళ గెలిస్తే అప్పుడు ఆయినా మంత్రి పదవుల కోలాటం తప్పేలా లేదు. ఇవన్నీ చూస్తుంటే  బాబుగారికి ఉగాది పచ్చడి రుచులు ఈ సంవత్సరం బానే  తగిలేలా వున్నాయి. ఇరు ప్రాంతాల అభివృద్ధి, రుణ మాఫీ, బి సి లకు సి యం లాంటి హామీలతో దేశం పార్టీ ముందుకు పోతోంది.

                                         ఇక వై యెస్ అర్ పార్టీ విషయానికి వస్తే అంత ఆశాజనకం గా లేదనే చెప్పాలి. కాంగ్రెస్ లో సరుకంత దేశం లో చేరడం ఇక్కడి నాయకులకు మింగుడు పడని విషయం గా ఉంది. పార్టీ నాయకత్వం లో అనుభవ రాహిత్యం కూడా తోడవటం తో ఎన్నికల వ్యూహం లో కాస్త వెనుకపడింది. అవినీతి ఆరోపణలు, కోర్ట్ కేసు లు, జైళ్ళు ఇలాంటి వాటివల్ల అప్పట్లో ప్రజల్లో వై యెస్ ప్రభుత్వం అంటే వున్న గౌరవమ్ మసకబారింది. వీటిని జనం లోకి తీసుకు వెళ్ళడం లో దేశం నాయకులూ బాగానే సఫలం అయ్యారు కూడా. ఇప్పుడు సీమాంద్ర అభివృద్ధి నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళే పనిలో తల మునకలై వుంది. వికలాంగుల పించను పెంపు, డ్వాక్రా రుణాల మాఫీ, వడ్డీ లేని రుణాలు, ఉచిత విద్య లాంటివి ఈ పరి అజెండాగా వుంది.

                                       ఇక ఇప్పుడే వికసించిన జనసేన, కమలం దండలో చేరింది. ఇక బి జె పి, దేశం పొత్తు విషయం ఒక కొలిక్కి వస్తే రాష్ట్రం లో సమీకరణాలు మరింత వేగం గా మారే అవకాశం వుంది. జై సమైక్య ఆంధ్ర పార్టీ ఊసు పెద్దగా లేనే లేదు. పార్టీ పెట్టడం లో కిరణ్ బాగా జాప్యం చెయ్యడం వల్లే ఈ పరిణామాలు వచ్చాయని చెప్పొచ్చు. ఇప్పుడు పార్టీ లో వున్న  వారు కూడా జంపింగ్ జపంగులుగా మారి సిద్దం గా వున్నారు. అందుకే కిరణ్ కూడా సీమంద్ర లో ఈ ఎన్నికలకి కాంగ్రెస్ లాగే ఆటలో అరటి పండు లా మారారు.

                                     ప్రస్తుతానికి ఎప్పటి లాగే జనం అన్ని పార్టీ మీటింగులకి తండోప తండాలుగా వస్తున్నారు . కాని రానున్న ఎన్నికలు మాత్రం అటు తెలంగాణాకి ఇటు సీమాంద్ర కి చాల ముఖ్యమైనవి. ప్రజలు ఆచి తూచి అడుగు వెయ్యాల్సిన సమయం ఇది. తాత్కాలికం గా ఉపసమనం కలిగించే హామీలకి, డబ్బుకి ఆశపడకుండా, దీర్ఘకాలిక లక్ష్యాలని దృష్టిలో ఉంచుకుని వోటేస్తే మంచిది. సీమాంద్ర లో ప్రస్తుతానికి కావలిసింది జనం గుండెల్లో ధైర్యం నింపగలిగే నాయకుడు, ప్రస్తుతానికి ఏ ఉపాధి లేకుండా వున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించగల నాయకుడు. అదే విధం గా తెలంగాణాకు ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొని వున్నా స్తబ్ధతను తొలగించి మళ్ళి అన్ని కంపెనీలు హైదరాబాద్ వైపు పరుగులు తీసేటట్టు చేసే నాయకుడు . లేదంటే ఏ ఆకాంక్ష తో అయితే  తెలంగాణా  వచ్చిందో దానికి ఉపయోగం లేదు.మళ్లీ తెలంగాణ ఇంకో ఉద్యమం తో పరుగులు తీయాల్సిందే .....  నాయకులు కూడా భాద్యతగా వ్యవహరించి మొత్తం అభివృద్దిని ఒకే చోట కేంద్రీకృతం చేయకుండా ఒక పద్దతితో ఎలా మొత్తం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయదలచుకున్నారో ప్రజలకి చెప్పాల్సిన భాద్యత వుంది.
రాష్ట్ర భవిష్యత్ ని గుర్తెరిగి, ఉన్నవారిలో మంచి నాయకుడిని ఎన్నుకుంటారని ఆశిద్దాం. ఇంతమంది నాయక దేవుళ్ళు కురిపిస్తున్న హామీల జల్లులలో  జనం ఏ దేవుడికి పీతాంబరాలు కట్టి ఊరిగేస్తారో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే ...

వయసు అయిపోయాక .......
ఈ రోజు నేను ఒక వ్యక్తిని కలిసాను ....... వయసు 70 ఏళ్ళు ...... ఆయన వుండేది చెన్న పట్టణం లో ....... తెలుగు వారంటే వల్లమాలిన అభిమానం ........ ఒకానొకప్పుడు సినీ రంగం లో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి ..... పేరు ప్రస్తుతానికి ఇక్కడ అప్రస్తుతం .........

మాటల మద్యలో ఇలా అన్నారు ఆయన ...... " ఇంకేం వుంది బాబు ఇంకో రెండు ఏళ్లలోనో ......... నాలుగు ఏళ్ళలోనో నేను వెళ్ళిపోతాను " అని ........ నిజమే ప్రతి ఒక్కరు వెళ్ళిపోయే వాళ్ళే ....... ఎవరికి ఇక్కడ స్తిర నివాసాలు లేవు ......... 

అందరు ఒక గూటి పక్షులమే ........ ఎప్పుడో ఒకప్పుడు యెగిరి పోవాల్సిన వాళ్ళమే ........ 

కాని ఇక ఆ సమయం సమీపిస్తోంది అని తెలిసినప్పుడు ఎలా వుంటుందో ......... !!!!

నేను తెలుసు కున్న దాని ప్రకారం ........... వయసయిపోయాక ........ మిగిలేవి రెండే ........ అనుభవాలు - జ్ఞాపకాలు ....... మిగతావన్నీ వీటి ముందు అంత విలువలేనివే ........ 
ఎన్ని చూసుంటారు అంత జీవితం లో ....... ఎన్నో కష్టాలు ...... వాటితో పాటే సుఖాలు ........ అనుబంధాలు  .......  అన్నీ ........

వాటన్నిటిని తలచుకుని చివరాఖరి ఘట్టం ముగించడం తప్ప ఇంకేం వుంటుంది అంత వయసు వచ్చాకా ....... 

నాకూ  ఒక రోజు వస్తుంది ........ ఆ రోజున ........ 

ఈ గాలికి ఊగే చెట్లు ....... ఆ పూజకై ఎదురు చూసే పూలు ....... 

ఆ రోడ్డు మీద తిరిగే బస్సులు ........ వాటిలో ఎక్కే కన్నె పిల్లలు ........ 

పొద్దున్నే పేపర్ వేసేవాడు ......... పాల ప్యాకెట్ లు ఇంటికి చేర్చే వాడు ........... 

ఆ రోడ్డు మీద కూరగాయలు అమ్మే వాడు ......... వాటి పక్కనే పాన్ తిని ఉమ్మె వాడు ......... 

ఆ బట్టల కొట్టు వాడు ...... ఆ కిరాణ షాప్ వాడు ........... నాకు బట్టలు కుట్టే వాడు ....... 

ఆ గుడిలో నా పేరు మీద పూజ చేసేవాడు ....... గుడి ముందు కొబ్బరి కాయలు అమ్మే వాడు .......... 

ఒకటో తారీకే ఇంటద్దె అడిగే మా ఓనరు గాడు  ....... వాడి వెనకే కరెంటు బిల్లులు తీసే కరంటు వాడు ..... 

నాతో పిచ్చ పాటి కాలక్షేపం కోసం వచ్చేవాడు ......... నాతో స్నేహం అంటే పడి  చచ్చేవాడు ....... 

అందరు వుంటారు ....... ఒక్క నేను తప్ప ........ !!!!!!!!

ఇప్పుడు  నేను కూడా వీళ్ళలో కొంతమందికి జ్ఞాపకం .........

వీళ్ళు ఎవ్వరన్నా నాకు లెక్క లేదు ఇప్పుడు ........ నేను వచ్చిన కార్యం ముగిసింది ఈ సారికి ......... 

మళ్ళి  మరో ప్రపంచం వైపు పరుగులు తీస్తూ నేను ........

మరో మహాత్ కార్యం కోసమై నేను ............ !!!!!!!!!!జీవిత సత్యం .... :)


మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం|
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా||

శ్లోకం అర్ధం : ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......