చీకటి వెలుగుల రంగేళి ......


ఎన్నికల యా (ఏ) ప్స్ .......


                                                       ప్పటి లాగే అందరికి మామూలు గానే  తెల్లారింది . కాని ఐ టి అప్పారావు కి మాత్రం అది మామూలు రోజు కాదు. అతనికి రాత్రి కలలో ఎన్నికల తల్లి కనపడింది ( అవును అన్నిటికి తల్లి వున్నప్పుడు ఎన్నికలకి కూడా వుంటే తప్పేంటి ?). తన బాధని ఇలా వెళ్ళగక్కింది " బాబూ ! ఈ జనాలు నాయకులని సరిగ్గా అర్ధం చేస్కో లేకపొతున్నారు, నువ్వే ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తెచ్చి జనాలు చెప్పేది కూడా నాయకులు వినేలా చేసి జనాల కస్టాలు తీర్చాలి " అని భోరున ఏడవటం మొదలెట్టింది. అసలే ఈ మద్య టి వి లలో గృహ హింస చట్టం, నిర్భయ చట్టం అని చూసాడేమో , మళ్ళి పోలీసులు వచ్చి ఎక్కడ ఆ ఏడుపుకి వీడే కారణం అని లోపల వేస్తారో అని " అలాగే నువ్వు ఏడుపు ఆపు తల్లి "అని అభయం ఇచ్చాడు . ఏడుపు ఆపేసిన ఎన్నికల తల్లి అల్ ది బెస్ట్ చెప్పి చటుక్కున మళ్ళి బాలెట్ బాక్స్ లో దూరింది . 
                                        వెంటనే ఏం చెయ్యలా అని ఆలోచించిన అప్పారావు ఒక యాప్ తయారు చెయ్యాలి అనుకున్నాడు. దీంతో  నాయకులు ఓటర్లు ఎప్పుడు కనెక్టెడ్ గా వుండి ఒకరి అభిప్రాయలు ఒకళ్ళు పంచుకోగలరు. దీనికి అనతి కాలం లోనే మంచి ప్రాచుర్యం లభించింది. దీంతో ఓటర్లతో పాటు నాయకులు కూడా బాగా వాడటం మొదలెట్టారు . టెక్నాలజీ లో ముందుండే బాబు గారు దీన్ని వాడటమే కాక పార్టీ లో అందరూ కూడా  తప్పకుండా వాడమని సూచించారు . ఇది తెలుసుకున్న మిగతా పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. 

                                         మొదటగా బాబు గారు " తమ్ముళ్ళు  ... ! అందరికి నమస్కారం ......... !!! మన పార్టీ మ్యానిఫెస్టో చూసారా ... అని వర్గాల వారి కోసరం (కోసం సామాన్య బాషలో ) రూపొందించాం. కాబట్టి దీన్ని జనాల్లోకి తీసుకు పోవాల్సిన బాధ్యతా మన అందరి మీద వుంది .... జై తెలుగు దేశం ..!! " అని అన్నారు . [గంటా, రాయపాటి, గల్లా ....... etc లైక్స్ దిస్ ]. తమకంటే ముందే కొత్తగా పార్టీ కి వచ్చిన వాళ్ళు లైక్ కొట్టడం తో అసహనానికి గురైన తెలుగు తమ్ముళ్ళు చేసేది లేక " సూపర్ సార్ .... సూపర్ సార్ ...." అని కామెంట్ లు అద్ది చేతులు దులుపుకున్నారు . ఇంకొంత మంది అటు మింగలేక ఇటు కక్కలేక గుడ్లప్పగించి చూస్తూ వుండిపోయారు . ఇదే ఊపు తో బాబు గారు తనదైన శైలి లో పార్టీ ఫోటో లు, హామీలతో ఆ విధంగా ముందుకి పోతూ వున్నారు. 

                                   ఈ సంగతి ఆ నోట ఈ నోట విన్న సోనియా వెంటనే కాంగ్రెస్ తరపున ప్రచారానికి చిరంజీవి ని పురమాయించింది . అసలే మనకి ఇప్పుడు అంతంత మాత్రం గా వున్న పాప్యులారిటి కి ఈ విభజన అంశం తోడవటం తో అదః పాతాళం లో వున్న  మన ఇమేజ్ గురించి మేడం కి చెప్పే ధైర్యం లేక సరే అని తలూపాల్సి వచ్చింది చిరు కి. వెంటనే చిరు పని మొదలు పెట్టి మొదటి అప్ డేట్ గా " విభజన కి కారణం కాంగ్రెస్ మాత్రమే కాదు, వై యస్ ఆర్ పార్టీ , టి డి పి ఓకే అనబట్టే ముందుకు వెళ్ళాం " అని అప్ డేట్ పెట్టాడు . [ సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, ..... గాంధీ ...... గాంధీ ...... గాంధీ ..... etc లైక్స్ దిస్]. ఇది చూసిన నన్నపనేని " బాబు ... !! చిట్టీ ..... " అని పాత శ్రీ లక్ష్మి ఫోటో కామెంట్ పెట్టింది . [ అంబటి లైక్స్ దిస్ ఫోటో కామెంట్ ]. ఇక సీమంద్రలో ఇలాంటి అవమానానే ఎదురవుతాయి అనుకున్న సోనియా దుకాణం తెలంగాణాకి మార్చి పొన్నాలకి ఆ పని అప్పచెప్పింది. వెంటనే పొన్నాల " తెలంగాణా తెచ్చింది కాంగ్రెస్సే .... ! " అని స్టేటస్ అప్ డేట్ చేసాడు . వెంటనే కవిత " అట్నా ... ! మంచిగా చెప్పినవ్ లే బిడ్డా ... ! " అని తెలంగాణా శకుంతల ఫోటో కామెంట్ పెట్టింది . [అంబటి లైక్స్ దిస్ ఫోటో కామెంట్ ]. ఇక చేసేది లేక దేవుడి దిక్కు అనుకుని జరిగేది చూడాలని డిసైడ్ అయ్యింది ఈ కాంగ్రెస్ టీం.

                                     ఇక అసలే ఏం అప్ డేట్ పెట్టాలో అర్ధం కాక తల పట్టుకుని కూర్చున్న జగన్ అంబటి కి ఫోన్ చేసి " ఎప్పుడూ  చిత్త కార్తె ......... "అని ఏదో ఒక నిముషం 3 సెకన్ల పొడవున్న బూతు తిట్టి వెంటనే ఇంటికి రమ్మని ఆదేశించాడు. కాని ఎప్పటి లాగే అందరితో చర్చించే లోపే సొంతగా స్టేటస్ అప్ డేట్ చేసేశాడు " అక్క చెల్లెమ్మలకి చేయూతనిచ్చే అమ్మ ఒడి పథకం మీదే నా మొదటి సంతకం " అని  . [ వాసి రెడ్డి పద్మ, రోజా , షర్మిల ........... etc లైక్స్ దిస్]. ఇంకా నయం అవినీతి అంతం అని ఏదన్నా బిల్లు తెస్తాను అని అప్ డేట్ చేస్తాడేమో అని భయ పడి  చచ్చాం అని గుస గుస లాడుకున్నారు. ఆ స్టేటస్ తను పెట్టుంటే ఆ లైక్స్ అన్ని తనకే వచ్చేవి కదా అనుకుంటూ వెనుదిరిగాడు అంబటి . 

                         ఇంకా కొత్త గా పార్టీ పెట్టిన పాత చెప్పుల కొట్టు అబ్బాయి " ఇంక గూడ్క ... మన రాష్టం గూడ్క సమైక్యం గానే వుంది .... ఆఖరి బాల్ మిగిలే వుంది . " అని అప్ డేట్ చేసాడు. ముందు దీనికి 10 లైక్స్ వచ్చాయి. కాని మరో 2 నిముషాలకే అవి 5 కి తగ్గిపోయాయి . వెంటనే ఎవరో గోడమీద పిల్లులు ఉన్నారన్న విషయం గ్రహించిన సారు ఆ పిల్లులు గోడ దాటకుండా పెద్ద గోడ ఎలా కట్టాలా అని బెర్లిన్ తాపి మేస్త్రి దగ్గర నేర్చుకుందామని అక్కడికి వెళ్ళిపోయాడు ప్రస్తుతానికి. 

                    మరో కొత్త పార్టీ వారికి ప్రస్తుతానికి తాడు బొంగరం లేవు కనుక అవి కొనుక్కుని వచ్చి, వచ్చే ఎలక్షన్లలో పాల్గొంటాం . .  . . అప్పటి దాక పుస్తకాల కొట్టు పెట్టుకుని నచ్చిన పార్టీ ల పోస్ట్ లకి లైకులు కొడుతూ వుంటాం అని చెప్పారు . 


ఈ తతంగం అంతా చూస్తున్న ఓటరు ఇలా తన స్టేటస్ పెట్టాడు " అయ్యా ... !! మీరు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు చాలు , కాని నాకు వీటితో అసలు పని లెదు. నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా. దయచేసి జనాల్ని సోమరిపోతులని చెయ్యకండి . నాకు 5 రూపాయలకే అన్నం అవసరం లేదు. అంతగా డబ్బులు లేకపోతే గుడిలో పెట్టే ఉచిత అన్నదానం లో తింటాం లేదంటే సత్రం లో తింటాం . అయ్యా ...!!! నాకు ఆడపిల్ల పుడితే మీరిచ్చే డబ్బులో ... నా పిల్లలకి ఉచితం గా విద్యలో వద్దు ....  మా ఆర్ధిక పరిస్థితి ని బట్టి మేము పిల్లల్ని పెంచలేం , వాళ్ళకి చదువులు చెప్పించలేం అని అనిపిస్తే పిల్లల్ని కనటమే మానేస్తాం .అయ్యా ... !!! నేను రుణం తీసుకున్న రోజే తెలుసు నాకు అది తిరిగి కట్టాలని ... దానికి ఇష్టపడే తీసుకున్నాను . దాన్ని నేను ఈ ఏడాదో లేదంటే వచ్చే ఏడాదో కడతాను. మీరు వాటిని మాఫీ చెయ్యాల్సిన పని లేదు . చూడండి బాబులు ఇలా వందలో ఒక్కరికి ఉపయోగపడే హామీలు వద్దు. వాటి పేరు చెప్పుకుని మిగతా డబ్బులు మీరు మింగొద్దు . ఈ సమాజానికి ఉపయోగపడేవి చెయ్యండి " అని చెప్పి ఓటరు ముగించాడు . ఇదంతా ఆసక్తి గా గమనిస్తున్న ఎలక్షన్ కమీషన్ " సమాజానికి ఉపయోగపడేవి అంటే ? " అని కామెంట్ పెట్టింది . 


                                        " అయ్యా ... ! మా ఊరికి రోడ్డ్డు లేదు .. అది వేయించండి ...రాత్రి అయితే ఊరు మొత్తం మీద ఒక్క వీధి దీపం వెలగదు ... అవి పెట్టించండి . . . . మా పిల్లలు బడికి పోవాలంటే రోజు పక్క ఊరు పోవాల్సి వస్తోంది ... మా ఊళ్లోనే ఒక బడి కట్టించండి . . . . రేపు మా పిల్లలు చదువు కుంటే వారికి ఉపాది దొరికేలా మంచి కంపనీ లను రాష్టానికి రప్పించండి ... మాకు ఉచితం గా లక్షల కార్పొరేట్ వైద్యం వద్దు సారూ .... మా ఊళ్లోనే ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రి కట్టించండి .  . . మీ ఉచిత వైద్యం చేయించుకోవటానికి 100 కిలో మీటర్లు వెళ్ళే దాక అయినా మా ప్రాణం నిలబడాలి కదా సారూ . . . . మా పొలాలు ఎండిపోకుండా చెరువులు తవ్వించండి ... ప్రాజెక్ట్ లు కట్టించండి .... కాని వాటి లో అవినీతి ని మాత్రం పారిచంకండి .... ఇన్ని సమస్యలు వదిలేసి ఏదో ఒకళ్ళు ఇద్దరికి ఉపయోగపడే ఈ పధకాలు మాకెందుకు బాబు ? మిగతా డబ్బు బినామీ పేర్లతో మీ జేబులోకి పోవటానికా  సారూ ... !! ఇవి చేస్తానని చెప్పండి మీకే ఓటేస్తాం ... !! లేకపోయినా ఓటేస్తాం .... కాకపోతే అందరికి ఒకే ఓటు " తిరస్కరణ ఓటు " " అని అన్ని పార్టీ లకి చెంప పెట్టు లాంటి సమాధానం చెప్పి మళ్ళి తన పనిలో మునిగిపోయాడు ఆ సామాన్యుడు . 

                                  ఇదంతా నిశితం గా గమనించిన ఎలక్షన్ కమీషన్ ఇక మీదట ఇలాంటి హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు చేస్తాం అని ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది . ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించని పార్టీలు బతుకు దేవుడా అంటూ ... మళ్ళి కొత్త మ్యానిఫెస్టో లు తయారు చేసే పనిలో పడ్డాయి ....

                                 ఇలాంటి రోజు ఒకటి రావాలని, తప్పకుండా వస్తుందనీ మనమూ ఆశిద్దాం .....
                          


నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......